2 Chronicles 15

1ఆ కాలంలో దేవుని ఆత్మ ఓదేదు కొడుకైన అజర్యా మీదికి వచ్చినపుడు అతడు ఆసా ముందుకు వెళ్లి ఈ విధంగా ప్రకటించాడు. 2<<ఆసా, యూదా ప్రజలారా, బెన్యామీను ప్రజలారా, మీరంతా నా మాట వినండి. మీరు యెహోవా పక్షపు వారైతే ఆయన మీ పక్షాన ఉంటాడు. మీరు ఆయన దగ్గర విచారణ చేస్తే ఆయన మీకు ప్రత్యక్షమవుతాడు. మీరు ఆయన్ని విడిచిపెడితే, ఆయన మిమ్మల్ని విడిచిపెడతాడు.

3చాలా రోజులుగా నిజమైన దేవుడు గానీ ఉపదేశించే యాజకులు గానీ ధర్మశాస్త్రం గానీ ఇశ్రాయేలీయులకు లేకుండా పోయాయి. 4అయితే తమ బాధల్లో వారు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా వైపు తిరిగి ఆయన్ని వెదకారు. ఆయన వారికి ప్రత్యక్షమయ్యాడు. 5ఆ రోజుల్లో అన్ని దేశాల్లో నివాసముండే వారందరూ గొప్ప కలవరంలో ఉండేవారు. కాబట్టి తమ కార్యాలు చక్కబెట్టుకోడానికి అటూ ఇటూ తిరిగే వారికి శాంతి, సమాధానం లేకుండా ఉంది.

6దేవుడు మనుషుల్ని అన్ని రకాల బాధలతో కష్టపెట్టాడు కాబట్టి రాజ్యం రాజ్యానికీ పట్టణం పట్టణానికీ వ్యతిరేకంగా లేచి ముక్కలు చెక్కలై పోయాయి. 7అయితే మీరు బలహీనులు కాక ధైర్యం తెచ్చుకోండి, మీ కార్యం సఫలమవుతుంది.>>

8ఒదేదు ప్రవక్త ప్రవచించిన ఈ మాటలు ఆసా విని, ధైర్యం తెచ్చుకొని యూదా బెన్యామీనీయుల దేశమంతటి నుండి, ఎఫ్రాయిము మన్యంలో తాను పట్టుకొన్న పట్టాణాల్లో నుండి అసహ్యమైన విగ్రహాలన్నిటిని తీసివేసి, యెహోవా మంటపం ముందు ఉండే యెహోవా బలిపీఠం మళ్లీ కట్టించాడు. 9అతడు యూదా, బెన్యామీను వారందరినీ ఎఫ్రాయిము, మనష్షే, షిమ్యోను గోత్రాల్లో నుండి వారి మధ్య నివసిస్తున్న పరదేశులనూ సమకూర్చాడు. అతని దేవుడైన యెహోవా అతనికి సహాయం చేయడం చూసి ఇశ్రాయేలు వారిలో నుండి చాలా మంది ప్రజలు అతని పక్షం చేరారు.

10ఆసా పరిపాలనలో 15 వ సంవత్సరం మూడో నెలలో వారు యెరూషలేములో సమావేశమయ్యారు. 11తాము తీసుకు వచ్చిన కొల్లసొమ్ములో నుండి ఆ రోజు 700 ఎద్దులను, 7,000 గొర్రెలను యెహోవాకు బలులుగా అర్పించారు.

12వారు తమ పూర్ణహృదయంతో, పూర్ణాత్మతో తమ పూర్వీకుల దేవుడైన యెహోవా దగ్గర విచారణ చేస్తామనీ, 13పిన్నలు, పెద్దలు, పురుషులు, స్త్రీలు, అందరిలో ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవా దగ్గర విచారణ చేయని వారికందరికీ మరణశిక్ష విధిస్తామనీ తీర్మానం చేసుకున్నారు.

14వారు పెద్దగా కేకలు వేస్తూ మేళాలతో, బాకా నాదంతో, కొమ్ము బూరశబ్దాలతో యెహోవా సన్నిధిలో ప్రమాణం చేశారు.

15ఈ విధంగా ప్రమాణం చేసుకోగా యూదావారంతా సంతోషించారు. వారు పూర్ణ హృదయంతో ప్రమాణం చేసి, పూర్ణమనస్సుతో ఆయనను వెదకడం వలన యెహోవా వారికి ప్రత్యక్షమై చుట్టూ ఉన్న దేశాలతో యుద్ధం లేకుండా వారికి శాంతినిచ్చాడు.

16తన అవ్వ అయిన మయకా అసహ్యమైన ఒక దేవతా స్తంభాన్ని నిలిపినందుకు ఆమె పట్టపురాణిగా ఉండకుండా ఆసా రాజు ఆమెను తొలగించి, ఆమె నిలిపిన విగ్రహాన్ని పడగొట్టి, చిన్నాభిన్నం చేసి కిద్రోను వాగు దగ్గర దానిని కాల్చివేశాడు. 17ఆసా ఎత్తైన పూజా స్థలాలను ఇశ్రాయేలీయులలో నుండి తీసివేయలేదు గానీ అతడు బ్రతికిన కాలమంతా అతని హృదయం యథార్థంగా ఉంది. 18అతడు తన తండ్రి, తాను ప్రతిష్ఠించిన వెండి, బంగారు ఉపకరణాలను తీసుకు వచ్చి దేవుని మందిరంలో ఉంచాడు. ఆసా పాలనలో 35 వ సంవత్సరం వరకు ఎలాటి యుద్ధాలు జరగలేదు.

19

Copyright information for TelULB